అరుదైన పద్యాలు

అరుదైన పద్యాలు (అంతర్జాల సేకరణ)

ఒకతెకు జగములు వణకున్;
అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్;
ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా;
పట్టపగలె చుక్కలు రాలున్


భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా ప్రమాదకరమని లేదా చాలా శక్తివంతురాలని భావము.

కవితా కన్య రసజ్ఞత కవి కన్నా
రసజ్ఞుడెరుంగు గాని కవి కేమి ఎరుగు;
నవ కోమలాంగి సురతము
భర్త ఎరుంగును కాని తండ్రికేమి తెలియును?

భావము: కవిత యొక్క భావంలోని అందం అది వ్రాసిన కవికంటే దాన్ని ఆస్వాదించే రసజ్ఞులకే బాగా తెలుస్తుంది. అలాగే యవ్వన స్త్రీ యొక్క సొగసులు తండ్రి కంటే కూడా భర్తకే బాగా తెలుస్తుంది.

పుస్తకం వనితా విత్తం పరహస్త గతం గతం;
అధవా పున రాయాతి జీర్ణం, భ్రష్టాచ ఖండశః

భావము: పుస్తకం, స్త్రీ, డబ్బు పరాయి చేతుల్లోకి వెళ్ళితే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం చిరిగిపోయి వస్తుంది, స్త్రీ చెడిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలు గా వస్తుంది.

ఆడుదానిఁ చూడ నర్థంబుఁ జూడఁగా
బ్రహ్మకైనఁ బుట్టు రిమ్మతెగులు
బ్రహ్మయాలి త్రాఁడు బండిరేవునఁ ద్రెంప
విశ్వదాభీరామ వినురవేమ

భావము: స్త్రీని చూసినా, ధనాన్ని చూసినా సృష్టికర్త అయిన బ్రహ్మ కు కూడా రిమ్మ తిరిగే కోరిక పుడుతుంది. బ్రహ్మ భార్య అయిన సరస్వతి యొక్క తాళిబొట్టు బండి రేవు వద్ద త్రెంపాలి. అనగా స్త్రీకి, డబ్బుకి లోంగని వాడు లేడని వేమన భావం.

ఆలు మగనిమాట కడ్డంబు వచ్చెనా
యాలుఁగా దది మరగాలు కాని
యట్టియాలు విడచి యడవి నుండుట మేలు
విశ్వదాభిరామ వినర వేమ!

భావము: భర్త మాటకు అడ్డం వచ్చే గయ్యాళితో కాపురం చేయుటకంటే అడవిలో జీవించడం మేలు అని కవి భావన.

 చదువెందుకు చంకనాకనా
మూడెనుములు మేపుకున్న
పాలిచ్చును, వెన్నిచ్చును, నెయ్యిచ్చున్
అవి అమ్ముకొన్న ధనమొచ్చున్

భావము: చదువుకొని ఇబ్బందిపడేకన్నా మూడు గేదెలను మేపుకొని వాటి నుండి వచ్చే పాలు, వెన్న, నెయ్యి అమ్ముకొని ధనం సంపాదించడం మేలు.

ఖగపతి అమృతము తేగా
బుగబుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగమొక్కై జన్మించెను
పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

భావము: గరుత్మంతుడు అమృతం తీసుకొస్తుండగా అది బుగబుగమని భూమిపై పడి పొగాకు మొక్కగా మొలిచింది. అందుకే పొగత్రాగనివాడు దున్నపోతై పుడతాడు అని కవిభావన.

దారెరుగని వాడును గో
దారిన తానొక్కమారు తడవని వాడును
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి

భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు, ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము. ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.

మూలము: ఇక్కడ 

Comments

Popular posts from this blog

Only for YOU

High demand for Foreign Language experts in India - Recruise Study